ఆశావాది ప్రకాశరావు

From Wikipedia, the free encyclopedia
ఆశావాది ప్రకాశరావు
జననంఆశావాది ప్రకాశరావు
1944, ఆగష్టు 2
అనంతపురం జిల్లా, సింగనమల మండలం కొరివిపల్లి గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఉపన్యాసకుడు
ప్రసిద్ధిఅవధాని, కవి, పండితుడు
భార్య / భర్తవడుగూరు లక్ష్మీదేవి
తండ్రిటీచర్ పక్కీరప్ప
తల్లికుళ్ళాయమ్మ

డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు.

జీవితవిశేషాలు[edit]

తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2 వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య ఇతని పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చాడు[1]. దళిత కుటుంబంలో జన్మించిన ఇతని బాల్యం బెళుగుప్ప, శీరిపి గ్రామాలలో గడిచింది. ఆ గ్రామాలలోని సోషియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతపురం పట్టణంలోని పొట్టిశ్రీరాములు మునిసిపల్ బాయ్స్ స్కూలులోనూ, రాజేంద్ర మునిసిపల్ హైస్కూలులోను 1953-1959 మధ్య చదివాడు. అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1960-61ల మధ్య పి.యు.సి. చదివాడు. అదే కాలేజీలో 1962-65లో బి.ఏ. స్పెషల్ తెలుగు చదివాడు. తరువాత ఎ.పి.పి.ఎస్.సి.గ్రూప్-4 పరీక్షనెగ్గి లోయర్ డివిజినల్ క్లర్క్‌గా ఏలూరులో కొద్దిరోజులు పనిచేశాడు. తన ప్రగతికి అవరోధంగా భావించి ఆ ఉద్యోగం వదిలి వెంకటాద్రిపల్లె, వై.రాంపురం,కణేకల్,కుర్లి జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగుపండితుడిగా 1965-68ల మధ్య పనిచేశాడు. అనంతపురం పి.జి.సెంటర్(శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధం) నుండి తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఏ. 1968-70ల మధ్య చదివాడు. 1970 నుండి రాయదుర్గం గవర్నమెంటు జూనియర్ కాలేజీలోను,అనంతపురం, గుంతకల్లు, నగరి, పుంగనూరు,పెనుకొండలలోని గవర్నమెంట్ డిగ్రీకాలేజీలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేశాడు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసి 2002లో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం పెనుకొండలో నివసిస్తున్నాడు.

అవధానపర్వం[edit]

అవధాన విద్యలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నాడు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇతడు ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు,బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్‌, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశాడు. ఇతని అవధానాలు దూరదర్శన్, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

సాహితీసాంస్కృతిక సేవ[edit]

  • 1978-1983 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ హైదరాబాదు - కార్యవర్గసభ్యుడు.
  • 1996-2002 శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - పాలకమండలి సభ్యుడు.
  • తిరుమల తిరుపతి దేవస్థానం - గ్రంథనిపుణుల మండలి సభ్యుడు - రెండుసార్లు
  • రాయలకళాగోష్ఠి అనంతపురం - వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి - రెండు దశాబ్దాలు
  • ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా - న్యూఢిల్లీ - సభ్యుడు
  • ఆంధ్ర పద్య కవితాసదస్సు -అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు - రాయలసీమ ప్రాంత కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు - రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేండ్లు.
  • ఆం.ప్ర.సామాజిక సమరసతావేదిక - రాష్ట్ర అధ్యక్షుడు -2007 నుండి.
  • రాయలసీమ రచయిత్రీరచయితల మహాసభ - సాహిత్యవిభాగ కార్యదర్శి - మూడు సంవత్సరాలు
  • దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠము, కడప - పద్యశిక్షణాతరగతుల నిర్వహణ - ఒక పర్యాయము
  • సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠము, ప్రొద్దుటూరు - కార్యదర్శి - రెండు సంవత్సరాలు
  • ఘనగిరి సాంస్కృతిక మండలి,పెనుకొండ - కార్యదర్శి - ఒక దశాబ్దము
  • ఆం.ప్ర.సాంస్కృతిక శాఖ, హైదరాబాదు - పద్యశిక్షణాతరగతుల నిర్వహణ - ఒక పర్యాయము
  • సాహితీ గగన్‌మహల్, పెనుకొండ - సలహామండలి సభ్యుడు
  • కలుగోట్ల విజయాత్రేయ సాహితీ రజతోత్సవ సంఘం, కర్నూలు - సభ్యుడు
  • ఆం.ప్ర.సాహితీ సాంస్కృతిక సంస్థల సమాఖ్య, మచిలీపట్నం - సభ్యుడు
  • జిల్లా సాంస్కృతికమండలి, అనంతపురం - కార్యవర్గ సభ్యుడు - ఐదు సంవత్సరాలు
  • అభ్యుదయ రచయితల సంఘం, అనంతపురం జిల్లా - సహకార్యదర్శి - ఒక సంవత్సరం
  • అనంతపురం జిల్లా రచయితల సంఘం - కార్యవర్గ సభ్యుడు - నాలుగు సంవత్సరాలు
  • మహాకవి గుఱ్ఱం జాషువా శతజయంతి కమిటీ, అనంతపురం - ఉపాధ్యక్షుడు - రెండు సంవత్సరాలు
  • అనంతసాహితి, గుత్తి - వ్యవస్థాపకుడు, సలహాసంఘ సభ్యుడు
  • భువనవిజయ శారదాపీఠము, గుంతకల్లు - వ్యవస్థాపక అధ్యక్షుడు
  • పాంచజన్య ప్రజ్ఞాసదస్సు,పెనుకొండ - వ్యవస్థాపక హితవరి
  • శ్రీ కళామంజరి, షాద్‌నగర్ - ప్రధాన సలహాదారు - 1995 నుండి
  • శ్రీశైలజ్యోతి (మాసపత్రిక), అనంతపురం - సహాయ సంపాదకుడు - రెండు సంవత్సరాలు
  • తెలుగు విశ్వవిద్యాలయం - అవార్డు కమిటీ సలహాసభ్యుడు - నాలుగు పర్యాయాలు
  • రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు (లలితకళాపరిషత్, అనంతపురం) - న్యాయనిర్ణేతల సంఘం సభ్యుడు - ఒక పర్యాయం
  • వేకువ (సాహితీ సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ),పెనుకొండ - సలహాసంఘసభ్యుడు -2009 నుండి.
  • అంతర్జాతీయ బాలల ఉద్యమసంస్థ న్యూఢిల్లీ - సభ్యుడు - రెండు సంవత్సరాలు
  • అధికార భాషా సమీక్షాసంఘం - జిల్లాస్థాయి సభ్యుడు - మూడు సంవత్సరాలు
  • తెలుగు భాషా వికాస ఉద్యమం - సలహాసంఘ సభ్యుడు - రెండు సంవత్సరాలు

రచనలు[edit]

  1. పుష్పాంజలి : 1968లో వెలువడిన ఈ పుస్తకంలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధాన సభలకు వెళ్ళినప్పుడు తన గురువు కవితావైభవాన్ని గురించి ఆశావాది ప్రకాశరావు ఆశువుగా చెప్పిన పద్యాలు ఉన్నాయి.
  2. వరదరాజశతకము : సమాజంలోని అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం. వనాధిజా మనోజ! వరదరాజ అనే మకుటంతో 108 పద్యాలున్నాయి. 1969లో ప్రకటితం.
  3. నిర్యోష్ఠ్య కృష్ణశతకము : రాప్తాటి ఓబిరెడ్డి వ్రాసిన ఈ శతకానికి ఆశావాది ప్రకాశరావు లఘుటీక వ్రాశాడు. 1972లో వెలువడింది.
  4. విద్యాభూషణ : తన అభివృద్ధికి కారణమైన భోగిశెట్టి జూగప్ప,ఐ.ఏ.ఎస్.(రిటైర్డ్) జీవితచరిత్ర ఇది. రాయలకళాగోష్ఠి అనంతపురం తరఫున 1973లో ప్రకటించాడు.
  5. మెరుపు తీగలు : పద్యఖండికల సంపుటి. అవ్వారి సాహిత్యపరిషత్, బుక్కరాయసముద్రం పక్షాన 1976లో వెలువడింది. గురువుగారైన నండూరి రామకృష్ణమాచార్యకి అంకితమివ్వబడిన ఈ గ్రంథంలో తన జీవితంలో తారసిల్లిన విద్వాంసులపై కవితలున్నాయి.
  6. ఆర్కెస్ట్రా : ఇది ఇతని సంపాదకత్వంలో వెలువడిన వచనకవితాసంకలనము. 1979 రాయలకళాగోష్ఠి ప్రచురణ.
  7. చెళ్లపిళ్లరాయ చరిత్రము : తాళ్లపాక అన్నమయ్య వ్రాసిన యక్షగానం ఇది. దీనిలోని ఇతివృత్తం బీబీ నాంచారి కళ్యాణగాథ. అముద్రితంగా తాళపత్రాలలో ఉన్న ఈ గ్రంథాన్ని ఆశావాది ప్రకాశరావు వెలికి తీసి పరిష్కరించి భువనవిజయ శారదాపీఠం(గుంతకల్లు) పక్షాన 1982లో ప్రచురించాడు. దీనికి విపులమైన పీఠిక వ్రాశాడు. కవికాలాదులను నిర్ణయించాడు.
  8. శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము : అజ్ఞాతంగా ఉన్న అద్భుతమైన కవి రాప్తాటి ఓబిరెడ్డి జీవిత సాహిత్యాలను వివరించే లఘు గ్రంథం. 1986లో అచ్చయ్యింది.
  9. సహాయాచారి సాహితీ సాహచర్యము : నడితోక మృత్యుంజయ సహాయాచారి వ్రాసిన సాయిలీలా గుచ్ఛము అనే గ్రంథంలో ఆశావాది ప్రకాశరావు వ్రాసిన ఈ వ్యాసం 1986లో చిన్న పుస్తకంగా వెలువడింది.
  10. పోతన భాగవతము -తృతీయ స్కంధము : తిరుమల తిరుపతి దేవస్థానము వారి పోతన భాగవతం ప్రాజెక్టులో భాగంగా భాగవతం తృతీయ స్కంధానికి సరళగద్యానువాదంగా వ్రాసిన ఈ గ్రంథం 1986 నుండి అనేక ముద్రణలు పొందింది.
  11. అంతరంగ తరంగాలు : ఈ వచనకవితా సంకలనంలో 52 ఖండికలున్నాయి. 1988లో నవ్యసాహితీ సమితి ప్రొద్దుటూరు ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీనిలోని కవితలు కొన్ని హిందీలోనికి అనువదించ బడ్డాయి.
  12. ప్రహ్లాద చరిత్ర - ఎఱ్ఱన పోతన తులనాత్మక పరిశీలన : ఒంగోలులోని ఎఱ్ఱన పీఠం నిర్వహించిన సిద్ధాంతగ్రంథాల పోటీలో బహుమతి పొంది 1989లో అదే సంస్థ చేత ప్రచురింపబడింది. డాక్టర్ జి.చెన్నయ్య సహరచయిత.
  13. జ్యోతిస్సుప్రభాతము : కె.మునిరెడ్డి సంస్కృతంలో రచించిన శ్లోకాలకు ఆశావాది ప్రకాశరావు చేసిన ఆంధ్రవచనానువాదం. 1989లో బ్రహ్మజ్ఞాన జ్యోతి ఆశ్రమం, తిరుత్తణి ప్రకటించింది.
  14. హనుమత్ స్తోత్రమంజరి : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1989లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు.
  15. సుబ్రహ్మణ్య స్తోత్రకదంబము : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1990లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు.
  16. లోకలీలాసూక్తము : భువనవిజయ శారదాపీఠం (గుంతకల్లు) ప్రచురించింది. 1990లో వెలువడింది.
  17. దీవనసేసలు: నూతన వధూవరులకు ఆశీర్వాద సందేశరూపమైన ఆశావాది కవితలు (55పద్యాలు + 2 వచన కవితఖండికలు) ఈ పుస్తకంలో ఉన్నాయి. 1992లో ప్రకటింపబడింది.
  18. అవధాన చాటువులు : ఆంధ్రపద్యకవితాసదస్సు అనంతపురం శాఖ ప్రచురించిన ఈ పుస్తకంలో కడప చిత్తూరు జిల్లాలలో చేసిన 24 అవధానాల విశేషాలు ఉన్నాయి. దీనిలో మొత్తం 153 పద్యాలు ఉన్నాయి. 1993లో అచ్చయ్యింది.
  19. రామకథా కలశం : 35 పద్యాలున్న ఆశు లఘుకావ్యం. దోర్నాదుల చిన్నవరదరాజు షష్టిపూర్తి సందర్భంగా ఆశావాది చెప్పినవి ఈ పద్యాలు. 1993లో ప్రకటింపబడింది.
  20. అవధాన దీపిక : అనంతకళాపీఠం పక్షాన 1998లో ప్రచురింపబడింది. అనంతపురం పట్టణంలో చేసిన 21 అవధానాల సంపుటి ఇది. తన తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, టీచర్ పక్కీరప్పలకు ఈ పుస్తకం అంకితమిచ్చాడు.
  21. దోమావధాని సాహితీకుంజర మూర్తిమత్వము : దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠం (కడప)వారి పురస్కారం అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగవ్యాసం ఇది. వైశ్యప్రబోధిని పబ్లికేషన్స్, కడప 1998లో ప్రకటించింది.
  22. అవధాన కౌముది : కోస్తాంధ్ర,తెలంగాణా, కర్ణాటక,తమిళనాడు, ఢిల్లీ మొదలైన చోట్ల ఆశావాది ప్రకాశరావు చేసిన 33 అవధానాల సంపుటి. మొత్తం 253 పద్యాలున్నాయి. శ్రీకళామంజరి షాద్‌నగర్ 2000లో ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
  23. అవధాన వసంతము : 2001లో శ్రీలేఖసాహితి వరంగల్ ప్రచురించిన ఈ గ్రంథంలో కర్నూలు జిల్లాలో చేసిన 28 అవధానాలు ఉన్నాయి.
  24. సుబోధినీ వ్యాకరణము : వివిధ పరీక్షాభ్యర్థుల ఉపయోగార్థం వ్యాకరణాదులు, ఛందస్సు, అలంకారాదులు ఈ గ్రంథంలో బోధించారు. సహ రచయిత సి.సుబ్బన్న. 2003లో ప్రచురితం అయ్యింది.
  25. పార్వతీశతకము : దీనిలో 108 తేటగీతి పద్యాలున్నాయి. 2003లో తొలిసారి ముద్రించబడింది. 'పార్వతీమాత! జగదేక భవ్యచరిత!' అనే మకుటాన్ని తరువాతి ముద్రణల్లో 'పార్వతీమాత! ఆశ్రితపారిజాత!'గా మార్చాడు. జె.నీలకంఠనాయుడు దీని ప్రచురణకర్త.
  26. అవధాన కళాతోరణము : అనంతపురం పట్టణం మినహా జిల్లాలో అంటాత జరిగిన 65 అవధానాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. 448 పద్యాలున్నాయి. సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠం(ప్రొద్దుటూరు) దీన్ని ప్రచురించింది. 'రాయల కళాగోష్ఠి' సంస్థకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు.
  27. ప్రత్యూష పవనాలు : ఆకాశవాణి అనంతపురం, కడప కేంద్రాలనుండి ఆశావాది ప్రకాశరావు ప్రసంగించిన సూక్తిముక్తావళి, వినదగుమాటలను ఈ పుస్తకంలో పొందుపరిచాడు. 2006లో ఇనుగుర్తి మనోహర్ ఈ పుస్తకాన్ని ముద్రించాడు.
  28. నడిచేపద్యం నండూరి : తన కవితా గురువు నండూరి రామకృష్ణమాచార్య వివిధ కృతుల నుండి ధారణకు ఒదిగిన భావ సౌందర్యం కలిగిన 154 పద్యాలను ఏర్చి సంకలనం చేశాడు. విద్యార్థులకు పద్యపఠన పోటీల నిమిత్తం ఈ పుస్తకాన్ని నండూరి శోభనాద్రి 2006లో ప్రచురించాడు.
  29. ప్రసారకిరణాలు : ఆకాశవాణి అనంతపురం,కడప,వరంగల్లు కేంద్రాలనుండి వెలువడిన 15 ప్రసంగాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 2007లో శ్రీలేఖసాహితి ఈ గ్రంథాన్ని ప్రకటించింది.
  30. సమారాధన : ఐదుగురు సాహితీమూర్తుల పరిచయాన్ని ఈ పుస్తకంలో వ్రాశాడు. 2007లో పల్లె శీను దీనిని ముద్రించాడు.
  31. ఆత్మతత్త్వ ప్రబోధము : 2007లో వెలువడిన ఈ గ్రంథంలో శ్రీపురక్షేత్రం పీఠాధిపతి రామకోటి రామకృష్ణానంద స్వామి భావాలకు పద్యరూపమిచ్చాడు. పి.కేశవరెడ్డి దీని ప్రచురణకర్త.
  32. భాగవత సౌరభము: భాగవత సంబంధమైన వ్యాసాలు పదకొండు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవన్నీ వివిధ సదస్సులలో సమర్పించిన పత్రాలు. 2008లో దీనిని మాజీ మంత్రి కొత్తపల్లి జయరాం ప్రచురించాడు.
  33. సమీక్షా స్రవంతి: 58మంది రచయితల 86 పుస్తకాలకు వ్రాసిన ముందుమాటలు, పీఠికలు, అభిప్రాయాలు,సమీక్షలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. 2008లో గ్రంథరూపం దాల్చింది.
  34. సువర్ణగోపురం: వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాల తాలూకు వ్యాసరూపం ఈ గ్రంథం. 2008లో ప్రచురింపబడింది.
  35. అవధాన వినోదం - సరస ప్రసంగం: తన అవధానాలలో అప్రస్తుతప్రసంగ పృచ్ఛకులకు ఇచ్చిన వాగ్రూప సమాధానాలు ఇందులో ఉన్నాయి. 171 మేల్తరమైన చమత్కార సమాధానాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 2008లో వెలుగు చూసింది.

ఆశావాది ప్రకాశరావు గురించి వెలువడిన పుస్తకాలు[edit]

  1. కళ్యాణవాణి - శాంతి నారాయణ(సంకలనకర్త)
  2. ఆశావాది ప్రకాశరావు సాహిత్యము - అనుశీలన - మంకాల రామచంద్రుడు -పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం
  3. అక్షరకిరీటి ఆశావాది - పి.రామసుబ్బారెడ్డి (సంకలనకర్త)
  4. అవధానాచార్య ఆశావాది - మాడభూషి అనంతాచార్యులు
  5. ఆశావాది కవితాంతరంగం - యన్.శాంతమ్మ
  6. ఆశావాది రచనాదృక్పథం - యన్.శాంతమ్మ
  7. ఆశావాది గ్రంథావలోకనం - ఆర్.రంగస్వామిగౌడ్ (సంకలనకర్త)
  8. ఆశావాది అంతరంగతరంగాలు - ఒక పరిశీలన - యన్.హేమావతి (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం)
  9. హిరణ్మయి - ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల విశేష సంచిక

అవార్డులు, పురస్కారాలు[edit]

  1. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - గౌరవ డాక్టరేట్ (డి.లిట్)ప్రదానం
  2. లోకనాయక్ పౌండేషన్, విశాఖపట్నం - అవధాన శిరోమణి పురస్కారం
  3. ఆరాధన సాంస్కృతిక సంస్థ హైదరాబాదు - జీవన సాఫల్య పురస్కారం
  4. భారతీ సాహితీసమితి, గుంతకల్లు - కందుకూరి వీరేశలింగం శతజయంతి పురస్కారం
  5. ఆంధ్ర సంఘం,హోసూరు - శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకోత్సవ పురస్కారం
  6. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - కార్యమపూడి రాజమన్నారు ధర్మనిధి పురస్కారం
  7. శ్రీ దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠం, కడప - శతావధాని పురస్కారం
  8. ఉన్నత విద్యాశాఖ, ఆం.ప్ర.ప్రభుత్వం - ఉత్తమ అధ్యాపక పురస్కారం
  9. టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్, విజయవాడ - కళాబంధు పురస్కారం
  10. తెలుగు భాషావిభాగం, బెంగుళూరు విశ్వవిద్యాలయం - జాషువా ధర్మనిధి పురస్కారం
  11. అరుణభారతి, బనగానపల్లి - ఉగాది సాహిత్యపురస్కారం
  12. కళాకౌముది, రాజంపేట - శతజయంతి కవుల పురస్కారం
  13. దగ్గుబాటి వేంకటేశ్వరరావు, విశాఖపట్నం - ఆత్మీయపురస్కారం
  14. ఆం.ప్ర.అధికార భాషాసంఘం - భాషాభిజ్ఞ పురస్కారం
  15. ఎఱ్ఱన పీఠము,ఒంగోలు - ఉత్తమ సిద్ధాంతగ్రంథ రచనా పురస్కారం
  16. ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ, హైదరాబాదు - రజతోత్సవ పురస్కారం
  17. 'దైవజ్ఞశేఖర' జి.వి.ఆర్.రాజు, బళ్ళారి - సప్తతి పురస్కారం
  18. హరిజన సేవక్ సంఘ్(ఆం.ప్ర), విజయవాడ - గాంధేయవాదకవి పురస్కారం
  19. తెనుగుభారతీ సాహిత్యపరిషత్, ఉయ్యూరు - ఉత్తమ సాహితీవేత్త పురస్కారం
  20. కళ్ళెపు సాగరరావు, హైదరాబాదు - ఆత్మీయ పురస్కారం
  21. అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రాంతీయసభలు, హైదరాబాద్ - నూతనాంగ్ల సంవత్సర పురస్కారం
  22. 'కవిరత్న' పాలాది లక్ష్మీకాంతంశ్రేష్టి, కడప - షష్టిపూర్తి పురస్కారం
  23. భాగ్యలక్ష్మీ ఫౌండేషన్, బద్వేల్ - విశిష్ట సాహిత్యసేవా పురస్కారం
  24. ఫ్రెండ్‌షిప్ ఫోరం ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ - భారత్ ఎక్సలెన్స్ అవార్డ్
  25. సాహితీ గగన్‌మహల్,పెనుకొండ - అనంత ఆణిముత్యాలు పురస్కారం
  26. లలితకళాపరిషత్, అనంతాపురం - మండల మాణిక్యాలు అవార్డు
  27. సర్దార్ద్జీ ఫ్రెండ్స్ అసోసియేషన్, ప్రొద్దుటూరు - ఉత్తమ సాహిత్య నిర్మాతల పురస్కారం
  28. కళాజ్యోతి, ధర్మవరం - సాహిత్యసరస్వతి పురస్కారం
  29. నండూరి రామాకృష్ణ్మమాచార్య సాహిత్యపీఠము,హైదరబాదు - నండూరి స్మారక వార్షిక పురస్కారం
  30. అనంతకళాపీఠము, అనంతపురం - కవిత్వవేది పురస్కార
  31. సాంస్కృతిక శాఖ, ఆం.ప్ర.ప్రభుత్వము - రాష్ట్ర్రకవి పురస్కారం
  32. రాపాక ఏకాంబరాచార్యులు, హైదరాబాదు - పదవీవిరమణ పురస్కారం
  33. పుష్పగిరిమహాసంస్థానం, కడప - సంక్రాంతి కవి పురస్కారం
  34. ఆం.ప్ర.ప్రథమ హరిజన మహాసభలు, హైదరాబాదు - తెలుగు వెలుగు పురస్కారం
  35. అక్కిరాజు రమాపతిరావు హైదరాబాదు - జన్మదిన ఆత్మీయ పురస్క్తారం
  36. శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయము, హన్మకొండ - శతజయంతి పురస్కారం
  37. గౌతురాజు హనుమంతరావు, హైదరాబాదు - గౌతురాజు సాహితీపురస్కృతి
  38. కె.అశ్వత్థయ్య, పెనుకొండ - స్వర్ణ గండపెండేర సన్మానం
  39. క్షీరసాగర సాహితి, హైదరాబాదు - కనకాభిషేకము[2]

ఇతనిని ఎందరో ప్రముఖులు సన్మానించారు. వారిలో బాబూ జగ్జీవన్ రాం, బెజవాడ గోపాలరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడు, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మండలి బుద్ధప్రసాద్,పి.వి.ఆర్.కె ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గొల్లపూడి మారుతీరావు మొదలైన వారున్నారు.

బిరుదులు[edit]

  • బాలకవి - సర్వేపల్లి రాధాకృష్ణన్
  • అవధానాచార్య - బద్దెన కళాపీఠము,బద్వేలు
  • అభినవ సాహితీసోమయాజి - నండూరి శిష్యసమితి, అనంతపురం
  • శారదాతనయ - ఆంధ్రసంఘం, తిరుత్తణి
  • కళాతపస్వి - జైభారత్ కళానికేతన్, పత్తికొండ
  • పండితమిత్ర - శ్రీశైల జగద్గురు పీఠం, గుంతకల్లు
  • అవధాన కిశోర - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, అనంతపురం
  • వాణీవరపుత్ర - భాగ్యసమితి, బద్వేలు
  • అవధాన కోకిల - చైతన్యభారతి, రాయదుర్గం
  • అపర జాషువా - జిల్లా రచయితలసంఘం, కడప
  • మధురకవి - యస్.సి.పోష్టల్ ఉద్యోగుల సంఘం,గుంతకల్లు

అవధానాలలో కొన్ని పూరణలు[edit]

నిషిద్ధాక్షరి

శ్రీదా!దయనన్ గన్మా!
వేదపథా!పర్వతస్థ!విద్యుద్ధాత్రీ!
బాధాఘ్నవిభూ!రమ్మా
నీ దర్శనభాగ్య మిమ్ము నీరదగాత్రా! (వేంకటేశ్వర స్తుతి)
శ్రీ జననీప్రియవస్త్రా!
భ్రాజత్ చక్రాంక!మాతృభాగ్యకళాంకా!
తేజోరక్షాదక్షా!
మా జాతీయ త్రివర్ణ మాన్యపతాకా! (జాతీయపతాకం గురించి)

సమస్యాపూరణ

  • ఉంగరమే నడుమునందు నూగిసలాడున్
బంగరు బొమ్మ యొకర్తుక
రంగస్థలి నిల్చి నాట్యరంజనబుద్ధిన్
బొంగరమట్లు వెసన్ తిరు
గుంగరమే(తిరుగున్+కరమే) నడుమునందు నూగిసలాడున్
  • నాది నాది నాది నాది నీది
అక్షరార్చనమ్ము, అవధానకలనమ్ము,
కవితలల్లునేర్పు, గానకళయు,
కూర్మిని విని కున్కు నోర్కి - క్రమమ్ముగా
నాది నాది నాది నాది - నీది

దత్తపది

  • లాకర్,జోకర్,వీకర్,క్రాకర్ ఈ పదాలతో జోలపాట
జోజో శిశులీలాకర!
జోజో కరుణాంబకా! విశుద్ధమహస్కా!
జోజో ధృతదేవీకర!
జోజో చక్రాకరకర!జోజోకృష్ణా!
  • జారేజా, పీరేపీ, వారేవా, తూరేతూ పదాలతో నిండు జవ్వని అందాల వర్ణన
జారే జాజుల వేణి తా కటిపయిన్ సయ్యాట మాడంగ సొం
పీరే పీసపయోధరాగ్రములపై విన్యాసముల్ సూపుచున్
వారేవారయినన్ చలించునటు రూపాజీవనల్ కాన కం
తూ! రే! తూపుల నేల నెక్కిడెద వన్యూన ప్రతాపంబునన్

వర్ణన

తెలుగున్నేల చెరంగునాల్గులను సందీపించు నీ ప్రక్రియన్
వలపున్ బెంచుచు నన్యరాష్ట్రములలో వ్యాపింపఁగాఁ జేసె నే
అలఘుం డాతడె మద్గురూత్తముఁడు సుబ్బన్నాఖ్యుఁ డీవేళ నా
తలలో నాల్కగ నిల్చి యిచ్చు జయ సంధానప్రదాశీస్సులన్
(సి.వి.సుబ్బన్న శతావధాని గురించి)
దోర్గర్వాంధుల కీలుబొమ్మయై సంతోషంబు కోల్పోవుటన్
స్వర్గక్షేమము సంఘచేతనము సంపాదింపగా స్త్రీలకున్
దుర్గాబాయి సతీశిరోమణి కృషిన్ తోరంబుగా నిల్పెనాన్
భర్గోత్తేజసుఖస్థితిన్ నిలిచెఁబో వాణీ నివాసంబిటన్
(దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్త్రీజనోద్ధరణకృషి గురించి)

మూలాలు[edit]

  1. దారిమార్పుTemplate:Reflist
  2. అనంతపురం జిల్లారచయితలు - అవ్వారి నారాయణ(1978)
  3. 20వ శతాబ్దంలో అనంతఆణిముత్యాలు - బత్తుల వేంకటరామిరెడ్డి(2001)
  4. సీమ సాహిత్య రత్నాలు - కొత్వాలు అమరేంద్ర(2009)
  5. ప్రకాశపథం - ఆశావాది సాహితీస్వర్ణోత్సవవిశేషసంచిక(2009)
  6. అవధాన చక్రవర్తి ఆశావాది (వ్యాసం) - ఆంధ్రజ్యోతి దినపత్రిక(25-9-1994)
  7. ఆధునిక అవధాని ఆశావాది (వ్యాసం) - రాచపాలెం చంద్రశేఖరరెడ్డి - ఆంధ్రభూమి దినపత్రిక(22-11-2000)
  8. అవధాన కోకిల-డా||ఆశావాది ప్రకాశరావు (వ్యాసం) - రాపాక ఏకాంబరాచార్యులు -ఆంధ్రజ్యోతి వారపత్రిక(1-8-2004)
  9. సాహితీవటవృక్షం ఆశావాది (వ్యాసం) - ఎస్.వి.శేఖర్‌బాబు - ప్రజాశక్తి దినపత్రిక(2006 ఆగష్టు 15)
  10. సాహితీరంగంలో ఆయన ఆశావాది (ఇంటర్వ్యూ) - ఈనాడు దినపత్రిక (13-7-2009)

ఇతర లింకులు[edit]

వర్గం:1944 జననాలు వర్గం:తెలుగు కవులు వర్గం:రాయలసీమ ప్రముఖులు వర్గం:అవధానులు వర్గం:అనంతపురం జిల్లా ప్రముఖులు

  1. ^ [1] డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు జీవిత ప్రస్థానం
  2. ^ ఎడిటర్ (26-12-2014). "తెలుగుజాతికే గర్వకారణం ఆశావాది". సాక్షి దినపత్రిక. Retrieved 27 December 2014. {{cite news}}: Check date values in: |date= (help)